ఆంధ్రప్రదేశ్ జల దోపిడీ చేస్తుందని తెలంగాణ పేర్కొనటం సహేతుకం కాదు

వ్యవసాయ అగ్రి మిషన్ ఉపాధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి.

గుంటూరు: కృష్ణానది దిగువున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జల దోపిడీ చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొనటాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అగ్రి మిషన్ ఉపాధ్యక్షులు ఎంవియస్ నాగిరెడ్డి ఖండించారు. ఈనెల 20వ తేదీన జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయ హాలులో కృష్ణానది జల వివాదాల పై జరిగిన చర్చాగోష్టి కి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ అగ్రి మిషన్ ఉపాధ్యక్షులు ఎంవీస్ నాగిరెడ్డి ప్రసంగిస్తూ భారతదేశంలో అత్యధిక వ్యవసాయ భూమికి నీటిని అందించే నది కృష్ణా నది అని,1380 టీఎంసీ ల స్టోరేజీ కెపాసిటీ కలిగిన కృష్ణానది,జల వివాదాలతో పయనిస్తుందని కేంద్ర జల శాఖ ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తో కృష్ణానది జల వివాదాలకు అడ్డుకట్ట పడిందన్నారు.బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీ ల నీటిని కేటాయించగా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు, తెలంగాణాకు 299 టీఎంసీల నీటిని అందించాలనే ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు తన 14 సంవత్సరాల పాలనలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేదని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే పావలా వడ్డీ కూడా రాదని తన మనసులో మాట పుస్తకంలో ప్రస్తావించిన దుర్మార్గపు నేత చంద్రబాబు నాయుడు అని విమర్శించారు.కేంద్ర జల సంస్థ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను స్వాగతించారు. కృష్ణా నదికి ఇరువైపులా ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలు ఉండటం వల్లనే జల వివాదాలు ఉత్పన్నమౌవుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం జూన్ 1 నుండి విద్యుత్ కోసం కృష్ణా నది నీటిని సముద్రపాలు చేయడం సహేతుకం కాదని పేర్కొన్నారు.మాజీ మంత్రివర్యులు,శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జల సమస్యలను రాజకీయ కోణంలో చూపించి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం భావ్యం కాదన్నారు.కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలుగకుండా జల వివాదాలను పరిష్కరించడానికి కృష్ణా రివర్ యాజమాన్య బోర్డును పటిష్ట పరచాలన్నారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 86 నీటిపారుదల ప్రాజెక్టులను ప్రారంభించి వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం,వెలిగొండ ప్రాజెక్టు లను పూర్తి చేస్తుండటం ఆనందదాయకమన్నారు. జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించి విద్యుత్ ను తయారు చేస్తూ సాగునీటిని సముద్ర పాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించినా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి సమయనం పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం కు రెండు లెటర్లను రాసి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి సన్నద్ధం కావడం మంచి పరిణామమన్నారు. ఏడు సంవత్సరాల కాలయాపన తర్వాత కేంద్ర ప్రభుత్వం కృష్ణా,గోదావరి నదులపై యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటాని స్వాగతించారు. ఈ చర్చాగోష్టిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యులు, వ్యవసాయ శాస్త్రవేత్త ఆర్.చెంగారెడ్డి, అగ్రి మిషన్ సభ్యులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, రిటైర్డ్ యస్. పి. డా “సిహెచ్ చక్రపాణి, చరిత్ర అధ్యాపకులు పాలేటి పోతురాజు, ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ దేవరపల్లి పేరి రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *